మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశాలతో…రెయిన్ బో హాస్పిటల్ కు ఖమ్మం బాలిక తరలింపు ఖర్చుకు వెనుకాడకుండా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం .మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ పర్యవేక్షణ.
నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని …
జిల్లా, పోలీసు, వైద్య అధికారులకు మంత్రి ఆదేశాలు

అత్యాచారానికి గురై ఆపై జరిగిన పెట్రోల్ దాడిలో దాదాపుగా 70శాతం కాలిన దేహంతో  ఉస్మానియా హాస్పిటల్ లో  చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన బాలిక తల్లిదండ్రులు ఉప్పలయ్య, నర్మమ్మల విజ్ణప్తి మేరకు అమ్మాయిని రెయిన్ బో హాస్పిటల్ కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ , గిరిజన సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఈ అమ్మాయి కేసును అత్యంత ప్రత్యేకంగా భావించి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ శ్రీమతి దివ్యగారు స్వయంగా పర్యవేక్షిస్తూ, నేడు రెయిన్ బో హాస్పిటల్ కు అమ్మాయిని తరలించి హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి, వైద్యం ఇప్పిస్తున్నారు.

బాలిక ఆరోగ్య పరిస్థితిని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో పాటు జిల్లా పోలీసు, వైద్య అధికారులతోనూ మాట్లాడి వెంటనే ఈ కేసుకు సంబంధించిన నిందితులకు కఠిన శిక్ష పడేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, శిశువుల సంక్షేమం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ముఖ్యంగా మహిళలపై దాడులు జరిగితే నిందితులు ఎంతటివారైనా వదలొద్దు అని స్వయంగా సిఎం కేసిఆర్ గారు చెప్పిన నేపథ్యంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ అమ్మాయి సంఘటనలో దాడికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.