వ్యవసాయరంగంలో విప్లవాత్మక అభివృద్ధి

సాగునీటి రంగాభివృద్దే కారణం

జూన్ 15 నుండి రైతుబంధు సాయం

ప్రతిపక్షాల కుయుక్తులను తిప్పికొడుతున్న రైతులు

కరోనా కష్ట కాలంలో ధాన్యసేకరణ సాహసం

ధాన్యం సేకరణలో కేంద్రం వివక్ష తగదు

గిడ్డంగుల నిల్వ సామర్ధ్యం ఇంకా పెంచుతాం

కల్తీవిత్తనాలతో రైతన్నకు తీరని నష్టం

కల్తీ విత్తనాలమీద ఉక్కుపాదం – పీడీ యాక్ట్ కేసులు

ఇందులో వ్యవసాయ అధికారుల పాత్ర ఉంటే డిస్మిస్

వరి సాగు నాటులో వెదజల్లే పద్దతిని ప్రోత్సహించాలె

ప్రగతి భవన్ లో జరిగిన వ్యవసాయ శాఖ
ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్

నూతన తెలంగాణ రాష్ట్రంలో ఆరునూరైనా వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింప చేసి, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనే సిద్దాంతంతో, వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. మిషన్ కాకతీయ తోపాటు, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాల మాగాణాగా తెలంగాణను తీర్చిదిద్దడంలో విజయం సాధించామని, రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మకంగా మార్చివేసామన్నారు.

కేసులేసి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, అవాకులు చవాకులు పేలినా, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వెనకడుగు వేయకుండా పట్టుపట్టి పూర్తి చేసుకోగలిగామన్నారు. తెలంగాణ రైతుకు నేడు వ్యవసాయం మీద ధీమా పెరిగిందన్నారు. అంకితభావంతో, రైతు సంక్షేమం వ్యవసాయాభివృద్ధి పట్ల చిత్తశుద్దితో,తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టడం వల్లనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగామని సిఎం అన్నారు.

వానాకాలం సీజన్ ప్రారంభమౌతున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను ఫెస్టిసైడ్స్ ను అందుబాటులోకి తేవాలని సిఎం అధికారులను ఆదేశించారు. కల్తీవిత్తనాలు, ఫెస్టిసైడ్స్, బయో ఫెస్టిసైడ్స్ పేరుతో మార్కెట్లోకి వస్తున్న కల్తీ ఉత్పత్తుల మీద ఉక్కుపాదం మోపాలని వ్యవసాయ శాఖ , పోలీసు, ఇంటెలిజెన్స్ శాఖలకు సిఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకనుంచి విత్తనాలు ఫెస్టిసైడ్లను అనుమతించిన కంపెనీల ద్వారా మాత్రమే విక్రయాలు జరిగేలా చూడాలని, ప్రభుత్వం జారీ చేసే క్యూ ఆర్ కోడ్ సీడ్ ట్రేసబిలిటీ విధానాన్ని అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని సిఎం ఆదేశించారు. విత్తనాలు ఫెస్టిసైడుల్లో కల్తీని అరికట్టడానికి కఠిన నిబంధనలను అమలు చేస్తూ, అవసరమైన చట్ట సవరణ చేయాలని, అందుకు సంబంధించి అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేయాలని సిఎస్ సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు. జూన్ 15 నుంచి 25 వరకు రైతుబంధు ఆర్ధిక సాయాన్ని ఎప్పటిలాగే ఆయా రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆర్ధిక శాఖ కార్యదర్శిని సిఎం ఆదేశించారు.
ప్రగతి భవన్ లో శనివారం వ్యవసాయ రంగం విత్తనాల లభ్యత కల్తీ విత్తనాల నిరోధం, రైతుబంధు పంపిణీ, ధాన్యం సేకరణ, మీద సిఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , ఎమ్మెల్సీ , రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి , ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి , బండి కృష్ణమోహన్ రెడ్డి , సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు , కార్యదర్శులు స్మితా సబర్వాల్ , భూపాల్ రెడ్డి , ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు , వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు , వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు , సివిల్ సప్లయిస్ కమిషనర్ అనిల్ కుమార్ , సీడ్స్ కార్పోరేషన్ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు

వ్యవసాయరంగంలో విప్లవాత్మక అభివృద్ధి :

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…‘‘ తెలంగాణ వ్యవసాయం ఎక్కడ ప్రారంభమైంది.. ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నదనే విషయాన్ని పరిశీలించినప్పుడు సంభ్రమాశ్చర్యం కలుగుతుంది. నీటికి కట కటలాడిన తెలంగాణలో నేడు 75 శాతం చెరువులు నదీ జలాలలతో నిండి వున్నయి. నడి ఎండాకాలంలో నిండుకుండలను తలపిస్తున్నవి. వొక్కవానపడితే చెరువులు అలుగులు దునకడానికి సిద్దంగా వున్నవి. రెండు పంటలకు కలిపి తెలంగాణలో నేడు కోటిన్నర టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతు పండిస్తున్నారంటే మామూలు విషయం కాదు. పంజాబ్ కు సరిసమానంగా తెలంగాణ లో వరిధాన్యం దిగుబడి అవుతున్నది. అంతే ధాన్యాన్ని ఇవ్వాల ప్రభుత్వం వొక్క గింజను పోనియ్యకుంటా నేరుగా రైతు వద్దనుంచి కల్లాల్లోనే కొంటున్నది. కరోనా వంటి కష్ట కాలంలో దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే రైతునుంచి ధాన్యాన్ని కొంటున్నది. అందుకు మనం గర్వపడాలి’’ అని సిఎం అన్నారు.

సాగునీటి రంగాభివృద్దే కారణం :

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తద్వారా నీటిపారుదల రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు వ్యవసాయ రంగం అభివృద్ది పథాన దూసుకుపోవడానికి ముఖ్య కారణాలని సిఎం వివరించారు. మిషన్ కాకతీయద్వారా చెరువులన్నీ పటిష్టంగా మారినయన్నారు. కట్టలు తెగకుండా వచ్చిన నీటి బొట్టును వచ్చినట్టే చెరువులు ఒడిసిపట్టుకున్నాయన్నారు. తద్వారా భూగర్భజలాలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం అందించే ఇరవైనాలుగు గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ద్వారా బోరు బావులతో పంటలు పండుతున్నాయన్నారు. కృష్ణా గోదావరి నదుల మీద ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు కట్టుకోవడం, కాళేశ్వరం దేవాదుల వంటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం, తదితర కొత్త ప్రాజెక్టులను మొదలు పెట్టడం వంటి ప్రభుత్వ చర్యల వలన వ్యవసాయ రంగంలో తెలంగాణ ఇంతటి ఘన విజయాన్ని సాధించగలిగిందని సిఎం అన్నారు.

రైతుబంధు సాయం :

ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు ఆర్ధిక సాయం వ్యవసాయాభివృద్దికి దోహద పడుతున్నదని సిఎం అన్నారు. ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతు ఖాతాలోనే జమవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పంటసాయం వల్ల రైతు శావుకారు దగ్గరికి అప్పుకు పోకుండా సకాలంలో వ్యవసాయం చేసుకుంటూ ఎరువులు విత్తనాలు కొని పంటకు పెట్టుబడి పెట్టి అధిక దిగుబడిని సాధించగలుగుతున్నారని సిఎం అన్నారు. ఉద్యోగుల నియామకం వంటి చర్యలతో వ్యవసాయ శాఖను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, వారి కృషి కూడా ప్రభుత్వ లక్ష్యానికి తోడయిందన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను ప్రోత్సహించడం ద్వారా కూడా అభివృద్ధిని సాధించగలిగామని, ఇట్లా వొక్కటొక్కటి గా వ్యవసాయనుబంధ రంగాలను అభివృద్ది పరుచుకుంటూ రావడం ద్వారానే తెలంగాణ వ్యవసాయంయ అభివృద్ధి చెందిదన్నారు. రాష్ట్ర వ్యవసాయం రాష్ట్ర సంపదకు తోడయ్యే విధంగా అభివ్రుద్ది పథంలో ముందుకు పోతున్నదని సిఎం తెలిపారు.

జూన్ 15 నుంచి రైతుబంధు సాయంం:

జూన్ 15 నుంచి 25 వ తేదీ లోపల రైతుబంధు పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని సిఎం కెసిఆర్ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడు కూడా అవలంబిస్తూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సిఎం ఆదేశించారు. ఇప్పటిదాకా ఇచ్చిన కాటగిరీ ల వారిగానే రైతు బంధు ఆర్ధిక సాయాన్ని ఖాతాలో వేయాలన్నారు. కాగా జూన్ 10 వ తేదీని కటాఫ్ డేట్ గా పెట్టుకోని ఆ తేదీవరకు పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ లోకి చేరిన భూములకు రైతు బంధు వర్తింప చేయాలని సిఎం ఆదేశించారు.

ప్రతిపక్షాల కుయుక్తులను తిప్పికొడుతున్న రైతులు :

‘‘ దేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప ఎక్కడా రైతువద్దనుంచి వొక్కగింజకూడా కొంటలేరు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కొన్ని ప్రతిపక్షాలు రైతుల వద్దకు పోయి ధర్నాలు చేయాలని కుయుక్తులకు పాల్పడుతున్నరు. కానీ వాస్తవం తెలిసిన, విజ్జత కలిగిన రైతులు ప్రతిపక్షాల ఆటలు సాగనిస్తలేరు. తిట్టి ఎల్లగొడుతున్నరు. గత సంవత్సరంలో కరోనా సమయంలో ఆర్ధిక వ్యవస్థ కుప్పుకూలితే తెలంగాణ జీఎస్డీపీకి వ్యవసాయ రంగం 17 శాతం ఆదాయన్ని అందచేసింది. ఇంకా పరోక్షంగా రాష్ట్ర ఆదాయానికి వ్యవసాయ రంగం ఆదెరువుగా మారే పరిస్థితికి చేరుకున్నిది’’ అని సిఎం అన్నారు.

నూటికి నూరు శాతం వ్యవసాయ స్థిరీకరణ :

ధాన్యం దిగుబడిలో తెలంగాణ ది దేశంలోనే నెంబర్ వన్ స్థానం అన్నారు. వొక్క కారు మాత్రమే వరి పంట పండించే పంజాబ్ కన్నా తెలంగాణలో రెండు పంటల ద్వారా అధిక దిగుబడి వచ్చిందన్నారు. రాబోయే కాలంలో మెదక్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో ఇంకా మరికొన్ని ప్రాజెక్టులను లిఫ్టులను పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగం నూటికి నూరు శాతం స్థిరీకరించబడుతుందన్నారు.

కరోనా కష్ట కాలంలో ధాన్యసేకరణ సాహసం :

‘‘ ఇవన్నీ అల్లాటప్ప మాటలు కావు. పిచ్చికూతలతోని అయ్యే పనులు కావు. ఇందుకు ఎంతో ధైర్యం కావాలె. ఇవ్వాల తెలంగాణలో రైతుల వద్ద ధాన్యాన్ని కొనడం అంటే వొక సాహసం. దేశంలో ఏరాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసాన్ని తెలంగాణ చేసింది. కరోనా సమయంలో లారీలు, హమాలీలు, డ్రైవర్లు, అన్ని కొరతే అయినా వాటన్నిటినీ అధిగమిస్తూ, ఇప్పటికే 87 శాతం ధాన్యాన్ని సేకరించినం. మరో నాలుగైదు రోజుల్లో సంపూర్ణ సేకరణ జరుపుతాం. ఎఫ్ సి ఐ తో మాట్లాడి ఎంత ధాన్యం వచ్చినా తప్పకుండా ప్రభుత్వం కొంటుంది. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ భయాందోళనలకు గురికావద్దు..ఆగమాగం కావద్దు.’’ అని సిఎం అన్నారు.

కేంద్రం వివక్ష తగదు :

తెలంగాణలో పండుతున్న వరి ధాన్యం మొత్తాన్ని కొనాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నమని సిఎం తెలిపారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం ధాన్యం సేకరిస్తున్న ఎఫ్ సీ ఐ.. తెలంగాణలో సేకరిచంక పోవడం పై సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఇట్లా వివక్ష చూపడం సరికాదన్నారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాయనున్నామన్నారు.

నిల్వ సామర్ధ్యం ఇంకా పెంచుతాం :

ధాన్యాన్ని కొనడం ఎంత శ్రమో ధాన్యాన్ని సేకరించి స్టాకు చేయడం కూడా అంతే శ్రమతో కూడుకున్నదని సిఎం తెలిపారు. తెలంగాణ వచ్చిన కొత్తలో కేవలం 4 లక్షల టన్నుల ధాన్యాన్ని స్టాకు చేయడానికి మాత్రమే గోడౌన్ల లభ్యత వుండేదని, కానీ నేడు 25 లక్షల టన్నుల ధాన్యాన్ని నిల్వచేసుకునేందుకు గోడౌన్ల నిర్మాణం జరిగిందన్నారు. భవిఫ్యత్తులో మొత్తం 40 లక్షల టన్నుల సామర్థ్యనికి గోడౌన్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు మార్కెటింగ్ శాఖ సిద్ధం చేసిందన్నారు.

కల్తీ విత్తనాలమీద ఉక్కుపాదం :

వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… విత్తనాల లభ్యత, ఎరువులు ఫెస్టిసైడ్ల లభ్యత, కల్తీ విత్తనాల నిర్మూలన అనే అంశం మీద సిఎం కెసిఆర్ చర్చించారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవాలని సిఎం వ్యవసాయ శాఖ అదికారులను ఆదేశించారు. కల్తీ విత్తనాలమీద ఉక్కుపాదం మోపాలన్నారు. జిల్లాల వ్యాప్తంగా కల్తీ విత్తన తయారీదారులమీద దాడులు జరపాలని . కల్తీ విత్తనదారులను వలవేసి పట్టుకోవాలని, ఎంతటి వారినైనా పీడీ యాక్టుకింద అరెస్టు చేసి చట్టబపరమైన చర్యలు తీసుకోవాలని సిఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చిత్తశుద్దితో పనిచేసి కల్తీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకున్న వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ, అధికారులను గుర్తించి వారికి ఆక్సిలరీ ప్రమోషన్, రాయితీల తో పాటు ప్రభుత్వం సేవా పతకం అందచేస్తుందని సిఎం స్పష్టం చేశారు. ఈ మేరకు తక్షణమే జిల్లాల వారిగా పోలీసులను రంగంలోకి దించాలని డిజిపీ కి ఫోన్లో సిఎం ఆదేశించారు. నిఘావర్గాలు కల్తీ విత్తన తయారీదారుల మూఠాలను కనిపెట్టాలని ఇంటిలిజెన్స్ ఐజీని సిఎం ఆదేశించారు.
‘‘ ఇగ మీరు నర్సింహావతారం ఎత్తాలె. దొరికినోన్ని దొరికినట్టే పట్టుకొని పిడీయాక్టు పెట్టాలె. ఇగ తెలంగాణ ల కల్తీ విత్తనాలు అమ్మలేమురా అనేటట్టు మీ చర్యలుండాలె. కల్తీ విత్తనాల మీద యుద్దం ప్రకటించాలె ’’ అని సిఎం ఆదేశించారు.

కల్తీవిత్తనాలతో రైతన్నకు తీరని నష్టం :

సన్న చిన్నకారు రైతు వొకటి రెండు ఎకరాలమీద ఆధారపడి కుటుంబాన్ని సాదుకుంటడని., అటువంటి రైతును కల్తీ విత్తనాలతో మోసం చేయడం అంటే దుర్మార్గమని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ కల్తీ విత్తనాలు కొని నాటేస్తే రైతు అన్నితీర్లా నష్టపోతడు. విత్తనం నాటి పంటను ఖర్చు చేసి పెంచుకోని తీరా కాతకాసే ముందు నిలబడి పోతే వూహించని పరిణామానికి గుండె బలిగి హతాశులైపోతరు..‘’ అని సిఎం అన్నారు. ఇందుకు కారణమయ్యే కల్తీ విత్తనదారులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో క్షమించదని స్పష్టం చేశారు. డేగ కన్నుతో కనిపెడుతూ కల్తీ విత్తనదారులు తప్పించుకోలేని విధంగా చక్రవ్యూహం పన్నాలె విత్తనాలనే కాకుండా ఫెర్టిలైజర్లు కూడా కల్తీ కావడం దుర్మార్గం. బయో ఫెస్టిసైడ్ల పేరుతో రైతులను మోసం చేసే ముఠాలను కూడా పట్టుకోని పీడి యాక్టు పెట్టాలె..అని సిఎం తెలిపారు.

వ్యవసాయ శాఖ అధికారులు పాల్పడితే డిస్మిస్ :

కల్తీ విత్తనాల తయారీ మీద జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తం కావాలన్నారు. వొకవేల వ్యవసాయ శాఖ అధికారులే స్వయంగా ఎక్కడైనా అవినీతికి పాల్పడుతూ కల్తీ విత్తన ముఠాలతో జట్టుకట్టినట్టు రుజవైతే వారిని ఆక్షణమే ఉద్యోగం లోంచి తొలగించడమే కాకుండా 5 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చూడాలన్నారు.

వ్యవసాయ శాఖ అలసత్వం వీడాలె :

వ్యవసాయ శాఖ అధికారులు అలసత్వం వీడాలె. ప్రేక్షక పాత్ర వహించకుండా కల్తీలను పసిగట్టి నియంత్రించాలె.దీనికి జిల్లా వ్యవసాయధికారి అసిస్టెంట్ డైరక్టర్లు బాధ్యత వహించాలె. వారి వారి జిల్లాల్లో పర్యటించాలె. కల్తీకి అలువాటు పడిన ముఠాలను గుర్తించి పీడీ యాక్టు బుక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలె. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్సీలు కమిషనర్లు సమీక్షలు నిర్వహించాలె. అని అన్నారు.

క్యూ ఆర్ కోడ్ విధానం :

కల్తీ విత్తనాల నియంత్రణకు దేశంలో మెట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో క్యూ ఆర్ కోడ్ తో సీడ్ ట్రేసబిలిటీని అమలు చేయాల్సిందిగా సిఎం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు. ప్రభుత్వం ఆమోదించిన విత్తన కంపెనీలే విత్తన విక్రయాలు చేపట్టేలా ఈ నియంత్రణ చర్యలుండాలని తెలిపారు. క్యూఆర్ కోడ్ తో కూడిన ప్రభుత్వ సర్టిఫైడ్ ముద్రిత విత్తనాల ప్యాకెట్ల మీద వుంటున్నందున, స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేయడం ద్వారా విత్తన కంపెనీల పూర్తి వివరాలుంటాయని మంత్రి సిఎం కెసిఆర్ కు వివరించారు. ఆలస్యం చేయకుండా తక్షణమే ఈ విధానాన్ని అమలులోకి తేవాలని సిఎం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు.

విత్తనాల లభ్యత :

ఇప్పటికే రోహిణీ కార్తె జొరబడినందున మరో వారం రోజుల్లో రుతుపవనాలు కూడా వస్తున్నందున, రైతులు వ్యవసాయానికి సిద్దమైతున్ననేపథ్యంలో రైతులకు విత్తనాలను ఎరువులను అందుబాటులో ఉంచాలని ఆమేరకు తక్షణమే ఏర్పాట్లు చేసుకోవాలని సిఎం అధికారులకు సూచించారు. పత్తి కంది వరిధాన్యం విత్తనాలను కావాల్సినంత మేరకు సేకరించి రైతలకు అందించాలన్నారు. అదే సమయంలో కావాల్సినంత ఎరువులను ఫెస్టిసైడ్లను సిద్దం చేసుకోవాలని తెలిపారు.
ఇద్దరు అడిషనల్ డైరక్టర్లను నియమించుకోండి :
వ్యవసాయ శాఖ రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులను నియమించుకోవాలని సిఎం మంత్రికి ఆదేశించారు. విత్తన, ఎరువులు ఫెర్టిలైజర్ల వ్యవహారాలు చూసేందుకు కోసం వొకరిని, మార్కెటింగ్ అనాలసిస్ రిసెర్చ్ వింగ్ కోసం మరో అడిషనల్ డైరక్టర్ ను నియమించుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేయాలని సిఎస్ కు సిఎం ఆదేశించారు.

వెదజల్లే పద్దతిని ప్రోత్సహించాలె
వ్యవసాయ శాఖ అధికారులకు సిఎం ఆదేశం :

వరి నాటులో వెదజల్లే పద్ధతి ద్వారా వరి పంట సాగు చేస్తే.. రెండు పంటలకు కలిపి కోటి ఎకరాలు సాగు చేసే తెలంగాణ రైతులకు సుమారు రూ.10 వేల కోట్లపైనే పెట్టుబడి మిగులుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలిపారు. ఈ పద్ధతిలో వరి పంట సాగు చేస్తే ఎకరానికి 2-3 బస్తాలు (1-2 క్వింటాళ్లు) దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ శాఖపై శనివారం ప్రగతి భవన్ లో జరిపిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో వరి నాటులో ధాన్యం వెదజల్లే పద్ధతి గురించి సీఎం ప్రత్యేకంగా చర్చించారు. ఈ పద్దతిలో వరి సాగు చేసే అంశంపై తెలంగాణ రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులను సీఎం ఆదేశిచారు. ఈ వరి ధాన్యం విత్తనాలను వెదజల్లే పద్ధతి ద్వారా బురదలో కాలు పెట్టకుండానే వరి పంట నాటుకోవచ్చని అన్నారు . ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ … ” నారు పోసే పని లేదు . నారు పీకే పని లేదు. నాటు పెట్టే పని లేదు. కూలీల కోసం గొడవ లేదు. కలుపు కూలీల ఇబ్బంది లేదు. నీటి వినియోగం 30- 35 శాతం తగ్గుతుంది. 10-15 రోజుల ముందు క్రాప్ వస్తుంది. మామూలు పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. ఈ వెదజల్లే పద్ధతి అయితే 8 కిలోల విత్తనపొడ్లు సరిపోతయి. వడ్లు సల్లినంక ఎన్ని రోజులకైనా నీళ్లు కట్టుకోవచ్చు. విత్తనపొడ్లు వెదజల్లినంక వర్షం పడే దాక కొన్నిరోజులు ఎదురు చూస్తే ఇంకా మంచిది. కాళేశ్వరం సహా అన్ని సాగు నీటి ప్రాజెక్టులు , లిఫ్టులు , సుమారు 30 లక్షల బోరుబావుల పరిధిలో వరి సాగు చేసే రైతులకు ఈ వరి నాటులో వెదజల్లే పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. ఖమ్మం జిల్లాలో ఈ వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసే రైతులను పిలిచి ఈ విధానం గురించి స్టడీ చేశాను . నేను స్వయంగా రైతును కాబట్టి నా పొలంలో ఈ విధానంలో వరి సాగు చేసి మంచి ఫలితాలను పొందాను. ఈ పద్ధతిలో విత్తనపొడ్లు సల్లడానికి యంత్ర పరికరాలు కూడా అందుబాటులో ఉన్నయి. తెలంగాణలో వరి సాగు చేసే రైతులందరూ ఈ వెదజల్లే పద్దతిని అనుసరిస్తే మంచిది” అని సీఎం వివరించారు.