దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ టెన్షన్ పెడుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే 5 రాష్ట్రాలకు(తెలంగాణ కూడా) లేఖ రాసిన విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,270 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 15 మంది చనిపోయారు. అదే సమయంలో 2,619 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 24,052 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది.

ఇక, రోజువారీ పాజిటివిటీ రేటు 1.03 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది. కేరళలో శనివారం ఒక్కరోజే 1,544 కేసులు నమోదయ్యాయి. మరోవైపు, మహారాష్ట్రలో వరుసగా మూడోరోజు వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో 4,31,76,817 పాజిటివ్ కేసులు నమోదు అవగా.. 5,24,692 మంది వైరస్ కారణంగా చనిపోయారు.
ఇదిలా ఉండగా.. మహారాష్ట్రను మరోసారి కరోనా కలవరపాటుకు గురిచేస్తోంది. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అక్కడి అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రయాణాల్లో, ఆఫీసుల్లో మాస్క్ తప్పనిసరిని చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రైళ్లు, బస్సులు, సినిమా హాల్స్, ఆడిటోరియమ్స్, ఆఫీసులు, ఆస్పత్రులు, కాలేజీలు, స్కూల్స్.. ఇలా క్లోజ్డ్గా ఉండే పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ తప్పనిసరి అని ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.